ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. సింగపూర్‌ ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు

  • సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్
  • ఎన్నారైలు ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపు
  • కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, పెట్టుబడులను వివరించిన మంత్రి
  • అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరంతా బ్రాండ్ అంబాసిడర్లుగా మారి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్‌లోని తెలుగు ప్రవాసులకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సోమవారం ఉదయం సింగపూర్ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులకు లభిస్తున్న ప్రోత్సాహం గురించి లోకేశ్ వారికి వివరించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేస్తుండటంపై ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో తమ వంతు కృషి చేయాలని, తాము పనిచేస్తున్న సంస్థల్లో ఏపీకి ఉన్న అవకాశాలను వివరించాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. పర్యటనలో భాగంగా లోకేశ్ పలు గ్లోబల్ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.

ఈ సింగపూర్ పర్యటన ముగించుకుని లోకేశ్ ఈరోజు రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. మంగళవారం అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా హిమంత్ బిశ్వ శర్మ స్వయంగా లోకేశ్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అస్సాం పర్యటన అనంతరం ఆయన అమరావతికి తిరిగి వస్తారు.

Nara Lokesh
Andhra Pradesh
Singapore
NRI
Investments
Royal Enfield
Himanta Biswa Sarma
Assam
Brand Ambassador
AP Development

More Telugu News